: 'ఇసిస్'ది పవిత్ర యుద్ధం కాదు: తిరిగొచ్చిన ఉగ్రవాది మాజిద్
'ఇసిస్'లో చేరి తిరిగొచ్చిన ఉగ్రవాది ఆరిఫ్ మాజిద్ ఆదివారం సదరు ఉగ్రవాద సంస్థ దారుణాలను వెల్లడించాడు. పవిత్ర యుద్ధం పేరిట వారు దారుణ మారణకాండకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించాడు. "అసలు వారు చేస్తున్నది పవిత్ర యుద్ధమే కాదు. పవిత్ర గ్రంధం ఖురాన్ ను కూడా వారు గౌరవించడం లేదు. లెక్కలేనంత మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్న వారిది పవిత్ర యుద్ధమెలా అవుతుంది?" అని అతడు ప్రశ్నించాడు. ఇసిస్ నుంచి తిరిగి వచ్చిన అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. విచారణలో భాగంగా ఇసిస్ లో చేరేందుకు తనకు సహకరించిన ఇసిస్ మద్దతుదారుల పేర్లను అతడు వెల్లడించాడు. ఉగ్రవాద పోరుకోసమని పిలిపించుకున్న తనతో ఇసిస్ తీవ్రవాదులు మరుగుదొడ్లు కడిగించారని, బుల్లెట్ గాయమైన తనను మూడు రోజులుగా అసలు పట్టించుకోలేదని అతడు వాపోయాడు.