: రిజర్వాయర్ల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలను దించండి: కేంద్రానికి ఏపీ సర్కారు వినతి
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తమ అభ్యంతరాలను లెక్కచేయకుండా తెలంగాణ సర్కారు కొనసాగించిన విద్యుదుత్పత్తి అంశాన్ని ఏపీ సర్కారు తీవ్రంగానే పరిగణించినట్లుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులు, జలాశయాల వద్ద పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర బలగాల్లోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలతో ఆయా ప్రాజెక్టులు, జలాశయాల వద్ద భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరింది. తమ పరిధిలోని రిజర్వాయర్లతో పాటు విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను రెండు బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునేలా కేంద్ర జల సంఘం చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు సర్కారు లేఖ రాసింది. విద్యుత్ కొరతను సాకుగా చూపుతూ జలాశయాల్లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగించడం వల్ల తమకు ఇబ్బందులు తప్పేలా లేవని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఆయా బోర్డుల ఆదేశాలను కూడా తెలంగాణ సర్కారు బేఖాతరు చేస్తున్న వైనంపైనా కేంద్రానికి ఫిర్యాదు చేసింది.