: ఆర్ఆర్ బీ పరీక్షలో మాస్ కాపీయింగ్ కలకలం
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ పరిధిలో జరిగిన రాత పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగింది. దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో పది మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, మాస్ కాపీయింగ్ కు సూత్రధారిగా వ్యవహరించిన రైల్వే ఉద్యోగి మచేందర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మాస్ కాపీయింగ్ కు పాల్పడిన వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాట్స్ యాప్ ద్వారా ప్రశ్నపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మొత్తం పది పరీక్షా కేంద్రాల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున బ్లూటూత్ పరికరాలు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రైల్వే ఉద్యోగితో పాటు మాస్ కాపీయింగ్ ఆధారంగా పరీక్షలు రాసిన మిగిలిన విద్యార్థులను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.