: ఒక్క క్లిక్ తో పార్టీ కార్యకర్తల సమగ్ర సమాచారం అందుబాటులోకి: చంద్రబాబు
కార్యకర్తల సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్ తో తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో కార్యకర్తల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యకర్తల ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, రేషన్ కార్డులతో పాటు వారి ఆదాయ వనరులు, వివరాలు, కుటుంబ నేపథ్యం తదితరాలన్నింటినీ సేకరిస్తున్నామన్నారు. సభ్యత్వ నమోదు పూర్తైన తర్వాత, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరి వివరాలను ఒక్క క్లిక్ తో తెలుసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆయన చెప్పారు. కార్యకర్తలను సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి బాట పట్టించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నామన్నారు. గడచిన సభ్యత్వ నమోదులో పార్టీలో చేరిన వారికంటే అధికంగా సభ్యత్వం నమోదైందని ఆయన తెలిపారు. ఈ దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో సభ్యులను పార్టీలో చేర్చుకోనుందని ఆయన వెల్లడించారు.