: గడువులోగా పనులు పూర్తి చేస్తే, అదనంగా రూ. 10 లక్షల నిధులు: కేసీఆర్
మంజూరైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే పంచాయతీలకు అదనంగా మరో రూ.10 లక్షల నిధులను విడుదల చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివారం రాత్రి తన సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలతో వెంకటాపురం గ్రామంలో భేటీ అయిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. గజ్వేల్ ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన కేసీఆర్, పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆయా పంచాయతీల సర్పంచ్ లు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వేగంగా పనులు పూర్తి చేసే పంచాయతీలకు నజారానాగా విడుదలయ్యే నిధులను తన ఏసీడీపీ కోటా నుంచి మంజూరు చేస్తానని ఆయన వెల్లడించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడమే కాక నాణ్యత విషయంలో కూడా రాజీపడరాదని ఆయన సూచించారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని స్వయం సమృద్ధం చేయడమే కాక రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన ప్రకటించారు. గజ్వేల్ లో మొదలయ్యే అభివృద్ధిని రాష్ట్రమంతా విస్తరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.