: సంక్షోభంలోనే అవకాశం వెతుక్కుంటా... సినీ పరిశ్రమ స్పందన అద్భుతం: బాబు
సినిమా పరిశ్రమ మొత్తం ఇక్కడే కనబడడం తనకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో జరిగిన 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి వచ్చి, మరోసారి ఎన్టీఆర్ ను గుర్తు చేశారని అన్నారు. 'మేము సైతం' అంటూ సినీ పరిశ్రమ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కష్టంలో ప్రతి ఒక్కరూ స్పందించిన తీరు తనను ఆకట్టుకుందని ఆయన చెప్పారు. మన రాష్ట్రం, పక్క రాష్ట్రాల ప్రజలు, నేతలు అంతా స్పందించారని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎప్పుడో, ఎక్కడో జరగాల్సిన సంఘటన విశాఖలో జరగడం దురదృష్టం అని ఆయన వివరించారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని బాబు పేర్కొన్నారు. ఆపదలో ఉండే వారిని ఆదుకుంటే ఎలా స్పందిస్తారో చూపిన ఘటన హుదూద్ తుపాను ఘటన అని ఆయన వెల్లడించారు. ప్రధాని వచ్చినప్పుడు విశాఖ ప్రజలు చూపిన మనోనిబ్బరం, చొరవను తాను ఎన్నటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. తుపాను సందర్భంగా ఎంతో అవస్థపడి విశాఖ చేరుకుంటే ఒకరోజు వరకు బాత్రూం కూడా దొరకలేదని ఆనాటి సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ లో ఎలాంటి తుపాను వచ్చిన విశాఖను ఏమీ చేయలేని విధంగా పునర్నిర్మిస్తామని బాబు తెలిపారు. సినీ ఇండస్ట్రీ ఏం చేసినా సమాజం మీద ప్రభావం చూపిస్తుందని పేర్కొన్న ఆయన, సినీ పరిశ్రమ చూపిన చొరవను అభినందించారు. సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. విశాఖను అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. తెలుగు వారంతా ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ రెండు ప్రాంతాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో తెలుగు ముందుండాలని ఆయన సూచించారు. సమస్య ఉందని, సంక్షోభం ఉందని బాధపడే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. సంక్షోభంలోనే అవకాశం వెతుక్కునే వ్యక్తినని ఆయన పేర్కొన్నారు. తుపాను కానీ వచ్చి ఉండకపోతే, విశాఖను తాకి ఉండకపోతే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేది కాదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో పెద్ద సిటీగా విశాఖపట్టణంపై అందరి కళ్లూ పడ్డాయని తెలిపిన ఆయన, 'హుదూద్' దెబ్బతో దిష్టి కూడా పోయిందని అన్నారు. జపాన్ లో మనకంటే తెలివైన వారు లేరని అభిప్రాయపడిన ఆయన, నిరంతర శ్రమ వారిని ధనికులుగా చేసిందని, మనం కూడా అలాగే కష్టపడి రాష్ట్రాన్ని, దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విశాఖకు మనస్పూర్తిగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలని, వారిని అభినందిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. సేకరించిన నిధులతో ఓ కాలనీ నిర్మించి, సినీ కాలనీగా తీర్చిదిద్దాలని ఆయన సినీ పరిశ్రమకు సూచించారు.