: 'మేము సైతం'ను నోరూరించిన బాహుబలి టీం వంటావార్పు
మేము సైతం అంటూ హుదూద్ బాధితుల కోసం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 'బాహుబలి' సినిమా టీం వంటలు చేసింది. కీరవాణి స్వరకల్పన చేసిన ఓ పాట కోసం బాహుబలి టీం ఓ వీడియో షూట్ చేసింది. వీడియోలో బాహుబలి నిర్మాత తనకు పసందైన భోజనం పెట్టి తృప్తి పరిస్తే ఊహకందని గిఫ్ట్ అందజేస్తానని ప్రకటించారు. దానికి ఆశపడ్డ ప్రభాస్ తనకు వంట రాదు కనుక కీరవాణిని పక్కకు లాగేసి అతని భార్య వల్లిపై భారం వేసి ఆమెతో జత కలిశాడు. అనుష్క తనపై నమ్మకం లేక శోభు యార్లగడ్డను ఎంచుకుంది. తమన్నా వెస్ట్రన్ రెసిపీలు చెప్పడంతో తమన్నాతో దర్శకుడు రాజమౌళి జత కలిశారు. రాణా కెమెరా మెన్ సెంథిల్ తో జోడీ అయ్యారు. కీరవాణి రాజమౌళి భార్య రమతో సెట్ అయ్యారు. అంతా కలిసి వంట చేసేందుకు సమాయత్తమవుతుంటే అనుష్క, తమన్నా, రానాలు అందరి వంటలు చెడగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. ప్రభాస్ వారి వెంటపడి తరమడంతో వంటలు అయ్యాయనిపించారు. చివరకు భోగవల్లి ప్రసాద్ కు తినిపించి గిఫ్ట్ అడిగారు. అప్పుడు ఆయన వారికి అసలు విషయం చెప్పారు. మేము సైతం కోసం ఏదైనా చేయమంటే తప్పుకు తిరుగుతున్నారని, అందుకే ఇలా చెప్పి తాను ఇది షూట్ చేశానని ఆయన చెప్పి వారిని తుస్సుమనిపించారు.