: 15 సార్లు గర్భస్రావమైన మహిళకు అందిన కమ్మని అమ్మదనం!
సైన్స్ పరిశోధనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. పిల్లలు లేరని కుమిలిపోయే తల్లిదండ్రులకు ఫెర్టిలిటీ సెంటర్లు ఊరటనిస్తున్నాయి. తాజాగా 15 సార్లు గర్భస్రావమైన ఓ మహిళ 16వ ప్రయత్నంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన చెన్నైలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ లో చోటుచేసుకుని ఓ కుటుంబంలో ఆనందం నింపింది. 1995లో నైవేలికి చెందిన అభిరామి (19)కి శ్రీధర్ తో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే గర్భం ధరించిన అభిరామి ప్రమాదానికి గురైంది. దీంతో నాలుగు నెలల గర్భిణిగా ఉన్నపుడు తొలిసారి గర్భస్రావం అయిపోయింది. ఆ తరువాత రెండోసారి గర్భం ధరించిన ఆమెకు ఏడో నెలలో డెలివరీ అయినప్పటికీ, గర్భంలోనే శిశువు చనిపోయినట్లు తెలిపారు. తరువాత పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న ఆమెకు 13 సార్లు గర్భస్రావం అయింది. దీంతో 2011లో చెన్నైలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ ను శ్రీధర్, అభిరామి దంపతులు సందర్శించారు. ఈ దశలో అభిరామికి 46 ఏళ్లు వచ్చేశాయి. మహిళలకు 30 ఏళ్లు దాటితే గర్భావకాశాలు సన్నగిల్లుతాయని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు ఇంటర్ వెల్ ల్యాఫ్రాస్కోపిక్ అబ్‌డామినల్ సెర్క్ల్‌జ్ విధానంతో 16వ సారి అందించిన చికిత్సతో గర్భం ధరించి, పండంటి బిడ్డకు జన్మనివ్వడం విశేషం. ఫెర్టిలిటీ వైద్య విధానంతో పండంటి బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం కల్పించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.