: జపాన్ నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయి: కంభంపాటి
జపాన్ నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రతినిధి బృందం వెంట కంభంపాటి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన ప్రభుత్వం తరఫున విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను జపాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు కూడా వివరించామన్నారు. ప్రధానంగా ఆటోమొబైల్, టెక్స్ టైల్ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామిక సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఆయన వెల్లడించారు. నిపుణులైన కార్మికులు, మెరుగైన భూవసతి రాష్ట్రంలో ఉన్నట్లు జపాన్ ప్రతినిధులకు చెప్పామని ఆయన తెలిపారు.