: నవ్యాంధ్ర రాజధానికి నిధులిస్తాం: కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా


నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమైన మేరకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, నిధుల విడుదలకు సంబంధించి సమాలోచనలు జరుగుతున్నాయన్నారు. కొత్త రాజధాని కోసం రూ.1.07 లక్షల కోట్ల నిధుల అవసరముందని శివరామకృష్ణన్ కమిటీ నివేదించిన అంశాన్ని ప్రస్తావించిన సిన్హా, ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిధుల విడుదలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రకటించాల్సిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తదితరాలపై చర్చించేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రానికి చెందిన మరో మంత్రి సుజనా చౌదరితో కలిసి ఆయన ఉన్నతాధికారులతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News