: అసెంబ్లీ మయసభలా సాగింది: రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మయసభను తలపించాయని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సభను మాయ చేశారన్న ఆయన ‘తండ్రి, ఓ కొడుకు, ఓ అబద్ధాల అల్లుడు’ చుట్టూనే సభ తిరిగిందని ఎద్దేవా చేశారు. సభను ఇష్టారాజ్యంగా నిర్వహించిన ఆ ముగ్గురు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్టును ప్రభుత్వం... కేటీఆర్, హరీశ్ రావులకు పంచినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన త్యాగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించిన ఆయన, అమర వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందన్నారు. బుద్ధుడి విగ్రహం వద్ద అమరవీరుల స్థూపాన్ని రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.