: తెలంగాణ సభలో ఎవరెంతసేపు మాట్లాడారంటే...!


వాడీవేడీగా జరిగిన తెలంగాణ శాసన సభ సమావేశాలు నేటితో ముగిశాయి. 19 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో అర్థవంతంగా చర్చ జరిగిన సమయం కాస్త తక్కువేనని చెప్పాలి. నిత్యం వాయిదా తీర్మానాలు, ప్రత్యేక చర్చలకు పట్టుబట్టడం, వ్యక్తిగత ఆరోపణలు, సభ్యుల సస్పెన్షన్ లు, విపక్షాల నిరసనల నేపథ్యంలో సభ అట్టుడికింది. 19 రోజుల సమావేశాల్లో మొత్తం 88.06 గంటల పాటు సభలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఇందులో అధికార పక్షం సగం మేర సమయాన్ని వాడుకుంది. ఆర్థిక బిల్లు సహా, సభ్యులు అడిగిన పలు అంశాలపై వివరణలు, తమపై జరిగిన దాడికి ప్రతిదాడి తదితరాల కోసం అధికార పక్షం 40.30 గంటల సమయాన్ని వినియోగించుకుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ 17.33 గంటల సభా సమయాన్ని వాడుకుంది. సభను యుద్ధరంగంగా మలిచిన టీడీపీ మాత్రం 7.52 గంటల సమయాన్ని మాత్రమే తీసుకుంది. పలు అంశాల్లో ప్రభుత్వానికి వెన్నదున్నుగా నిలిచి, కొన్ని సందర్భాల్లో సర్కారును ఇరకాటంలోకి నెట్టిన ఎంఐఎం సభ్యులు 7.56 గంటల పాటు సభలో మాట్లాడారు. టీడీపీ, ఎంఐఎం లను అధిగమించిన బీజేపీ, సభలో ఏకంగా 8.56 గంటల పాటు తన వాణిని వినిపించింది. వైకాపా సభ్యులు 2.10 గంటలు, సీపీఐ 1.17 గంటలు, సీపీఎం 2.11 గంటలు, బీఎస్పీ సభ్యుడు 7 నిమిషాల పాటు సభలో మాట్లాడారు.

  • Loading...

More Telugu News