: కాంగ్రెస్ లో చేరికపై ఖుష్బూ వివరణ
కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నటి ఖుష్బూ వివరణ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య ఐక్యత కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. తన వివేకం, నమ్మకం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో చేరానని వివరించారు. 'లౌకిక భారతదేశం' తన స్వప్నమని పేర్కొన్నారు. చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ ను సందర్శించిన ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇళంగోవన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా, తన గురించి అధినేత్రి సోనియా గాంధీకి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా తెలుసని, వారు ఏ పదవి అప్పగిస్తే, దాన్ని స్వీకరిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2010లో డీఎంకేలో చేరిన ఖుష్బూ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. అటుపై ఆమె బీజేపీలో చేరుతుందని వార్తలు వచ్చాయి. చివరికి కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఊహాగానాలకు ముగింపు పలికారు. కాగా, పార్టీలో ఖుష్బూ చేరికపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఇళంగోవన్ మాట్లాడుతూ, ఖుష్బూ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని చెప్పారు.