: హుదూద్ నిధుల్లో సగం దుర్వినియోగం: వైకాపా నేత విజయసాయి రెడ్డి
ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్ తుపాను నేపథ్యంలో, కేంద్రం విడుదల చేసిన నిధుల్లో సగం మేర దుర్వినియోగమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విశాఖపట్నంలో జరిగింది. సమావేశానంతరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. హుదూద్ బాధితుల సహాయార్థం కేంద్రం రూ.460 కోట్లు విడుదల చేసిందని, ఇందులో సగం మేర నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తన జేబులో వేసుకున్నారని ఆయన ఆరోపించారు. కోట్లాది రూపాయల విరాళాలు ప్రభుత్వానికి అందుతున్నాయని, వాటన్నింటి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీలా ధన బలంతో కాకుండా ప్రజా బలంతో విజయం సాధిస్తామని ఆయన ప్రకటించారు.