: 'గవర్నర్ ఆఫ్ ఇండియా' అన్న యాంకరమ్మ... చిక్కుల్లో దూరదర్శన్


అందంగా, ఆకట్టుకునేలా ఉన్న ఓ మహిళా యాంకర్ నోటి నుంచి జాలువారిన రెండు మాటలు ప్రసారభారతిని చిక్కుల్లో పడేశాయి. గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫీ) ప్రారంభోత్సవం సందర్భంలో, మహిళా యాంకర్ తనదైన శైలిలో కామెంటరీ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా' ప్రస్తుతం మన దగ్గర ఉన్నారని అన్నారు. దీంతో అవాక్కవడం అక్కడున్న వారి వంతయింది. అంతేకాకుండా మహిళ అయిన మృదులా సిన్హాను ఉద్దేశించి.. 'ఆయన' ఇప్పుడు మనతో తన అభిప్రాయాలు పంచుకుంటారు అని చెప్పింది. ఈ కార్యక్రమం అప్పుడు లైవ్ టెలికాస్ట్ కూడా అవుతోంది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దూరదర్శన్ కు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. దీనిపై దూరదర్శన్ ఉన్నతాధికారి స్పందిస్తూ, నాలుగు నిమిషాల తర్వాత పొరపాటును సరిదిద్దుకుని పున:ప్రసారం చేశామని చెప్పారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించామని తెలిపారు. ఈ పొరపాటు చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోందని వెల్లడించారు. గతంలో కూడా దూరదర్శన్ ఇలాంటి పొరపాటే చేసి అభాసుపాలయింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేరులోని ఎక్స్ఐ (XI)ని పొరపాటుగా రోమన్ అంకె అనుకుని ఎలెవెన్ గా ఓ యాంకర్ పలికారు. దీంతో అప్పట్లో కూడా డీడీపై విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News