: శ్మశానంలో ఓ రాత్రి గడపనున్న కర్ణాటక మంత్రి
ఇంతకుముందు కర్ణాటకలో తాము అధికారంలో ఉన్నప్పుడు జేడీ (ఎస్) నేత హెచ్ డీ కుమారస్వామి 'గ్రామాల్లో బస' కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఆ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అప్పట్లో ఇది బాగా పాప్యులరైంది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి కాస్త అటూ ఇటూగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సతీశ్ జర్కిహోళి ఓ వినూత్న కార్యాచరణకు సిద్ధమయ్యారు. ప్రజల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు. బెళగావి నగరంలో డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ, తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు.