: ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల మధ్య సానుకూల దృక్పథంతో చర్చలు జరగ్గా, ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశమయ్యారు. పునర్విభజన చట్టం వచ్చిన తరువాత నెలకొన్న వివాదాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల సీఎస్ లు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. ఇంకా తెగని వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు తెలిపారు. విభజన చట్టంలోని అంశాలపై ఇరు రాష్ట్రాలకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. చర్చలు అర్థవంతంగా సాగుతున్నాయని ఆయన అన్నారు.