: ఢిల్లీలో మార్నింగ్ వాక్ ప్రమాదకరమట!
నగరాలు, పట్టణాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం మార్నింగ్ వాక్ కు అందరూ ప్రాధాన్యతనిస్తారు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయని, అందువల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని అందరూ భావిస్తారు. కానీ, పరిశోధనల ఫలితాలు మరోలా ఉన్నాయి. ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేసేవారికి తీవ్ర అనారోగ్య ముప్పుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. చలికాలం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో కాలుష్య కారకాలైన దుమ్ముధూళి కణాలు అలాగే ఉండిపోతున్నాయి. పొగమంచు కారణంగా దృశ్య స్పష్టత తగ్గిపోతుంది. దీంతో, సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు దుమ్ముధూళి కణాల సంఖ్య 2.5 శాతంగా నమోదవుతోందని పరిశోధకులు తెలిపారు. దీంతో, వేకువనే వాకింగ్ చేసే వారు పీల్చేగాలిలో కాలుష్యకారకాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఢిల్లీలో మార్నింగ్ వాక్ అంటే అనారోగ్యం కొనితెచ్చుకోవడమేనని, ఇంటికే పరిమితం కావడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.