: ఇమ్రాన్ ఖాన్ పార్టీతో సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటున్న పాక్
కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో, పార్టీతో సమస్యలన్నింటిపై చర్చించి, పరిష్కరించుకునేందుకు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే తెహ్రీక్ పార్టీ చేసిన నిరసనలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని పాక్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి ఎహసాన్ ఇక్బాల్ తెలిపారు. అందుకే వారితో అంశాలన్నింటిపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ నేతృత్వంలో కార్యకర్తలు, ఇతరులు చేసిన ఆందోళనలు దేశ ఆర్థిక వ్యవస్థపై బాగా ప్రభావం చూపాయన్నారు. ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ లో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఇక్బాల్ చెప్పినట్టు పాక్ రేడియో తెలిపింది. ఆయన పర్యటనలో భాగంగా ఇంధన, ఇతర రంగాలకు సంబంధించిన పలు మెగా ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందని, పర్యటన రద్దుతో ఇవన్నీ నిలిచిపోయాయని వివరించారు. కాబట్టి, సమస్యల పరిష్కారానికి పాక్ రాజకీయ పార్టీలన్నీ ఐక్యత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.