: బిగ్ బాస్ షోలో వివాదం... సోనాలీ రౌత్ కి శిక్ష


కలర్స్ ఛానెల్ లో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్-8లో మరో వివాదం రాజుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు, ఫైట్లతో దేశీయ అభిమానుల్ని రంజింపజేస్తున్న బిగ్ బాస్-8లో గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో బాలీవుడ్ వర్థమాన నటి సోనాలీ రౌత్, అలీ ఖలీ మీర్జాను చెంపదెబ్బ కొట్టింది. సోనాలీని ఉద్దేశించి అలీ అసభ్యంగా మాట్లాడాడని పునీత్ ఇస్సార్ చెప్పడంతో వివాదానికి బీజం పడింది. దీంతో, సోనాలీ విషయం కనుక్కోకుండానే అలీని చెంపదెబ్బ కొట్టింది. కాగా, బిగ్ బాస్ షోలో హింసకు పాల్పడకూడదన్నది నిబంధన. దీంతో, జాతీయ టెలివిజన్ లో ఓ మహిళ తనను చెంపదెబ్బ కొట్టిన కారణంగా దేశంలో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని, కాబట్టి, ఇక తాను షోలో వుండననీ, తనను షో నుంచి బయటకు పంపించివేయాలని అలీ కోరాడు. దీంతో, బిగ్ బాస్ టీం అతనితో చర్చించి... అలా వెళ్ళిపోతే, ఆమె కొట్టిన చెంపదెబ్బ సరైందని ప్రజలు భావిస్తారని, ఎక్కడైతే ప్రతిష్ఠ కోల్పోయావో అక్కడే సంపాదించుకోవాలని సర్ది చెప్పారు. దీంతో, మనసు మార్చుకున్న అలీ వేరే రూంలో ఒకరోజు గడిపి తిరిగి ఇతరులతో కలిసిపోయాడు. తర్వాత అలీపై చేయిచేసుకున్న కారణంగా సోనాలీని బిగ్ బాస్ షో నుంచి బహిష్కరించినట్టు బిగ్ బాస్ టీం తెలిపింది. బిగ్ బాస్ షో ఆద్యంతం వివాదాలమయంగా నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నడుస్తున్న బిగ్ బాస్ షోకు అత్యంత ప్రజాదరణ ఉంది. టీఆర్పీ రేటింగ్ లో బిగ్ బాస్ నెంబర్ వన్ గా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News