: తొలి టెస్టుపై నీలి నీడలు... విషాదం నుంచి తేరుకోని ఆటగాళ్లు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లో డిసెంబర్ 4 నుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. బాధాకరమైన పరిస్థితుల్లో ఆసీస్ యువ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ మరణించడంతో ఇరు జట్ల ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా, ఆసీస్ ఆటగాళ్లు తమ సహచరుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు స్పందిస్తూ, తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదన్నారు. దీంతో, తొలి టెస్టు నిర్వహణపై సందేహ ఛాయలు అలముకున్నాయి. అటు, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తొలి టెస్టును రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే, టీమిండియా, ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరగాల్సిన రెండ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ రద్దయింది.