: రజనీకి సవాళ్లు విసురుతున్న దర్శకనటుడు
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. చిత్రసీమ నుంచి సాధారణ పౌరుల వరకు ఆయనను విశేషంగా అభిమానిస్తారు. తొలిసారిగా రజనీకి ఓ దర్శకనటుడు సవాల్ విసిరాడు. అతడి పేరు సీమాన్. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింట నటించాడు. నామ్ తమిళర్ కట్చి పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, రజనీ పొలిటికల్ ఎంట్రీ అంశంపై నోటికొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. "ఒక్కడివే వస్తావా... మద్దతుతో వస్తావా... రా, తేల్చుకుందాం" అంటూ సినీ తరహా పంచ్ లు విసురుతున్నాడు. తమిళుడే ఈ గడ్డను ఏలాలన్నది సీమాన్ ప్రధాన నినాదం. రజనీ మరాఠీ అన్న సంగతి తెలిసిందే. ఎల్టీటీఈ నేత వేలుపిళ్లై ప్రభాకరన్ జయంతి సందర్భంగా తిరునెండ్రయూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీమాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తమిళులే తమిళనాడును పాలించాలని, ఎవరు పడితే వారు జబ్బలు చరిస్తే ఊరుకోబోమని హెచ్చరించాడు. ప్రభాకరన్ కు సరితూగే నేత తమిళనాడులో మరెవ్వరూ లేరని, ఆయనను మహానేత అని ప్రతి తమిళుడు పేర్కొనాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాగా, సీమాన్ వ్యాఖ్యలను రజనీ అభిమానులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు రజనీ, సీమాన్ అభిమానుల మధ్య వివాదం రేపే అవకాశాలున్నాయి.