: ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆ పార్టీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బిల్లులోని పలు లోపాలను ఎత్తి చూపారు. అసలు బిల్లు రూపకల్పన సందర్భంగా సీఎం కేసీఆర్ గాని, ఆర్థిక మంత్రి రాజేందర్ కాని సమగ్ర కసరత్తు చేసినట్లు కనిపించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోళ్ల పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహకాలు డెయిరీ రంగానికి ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య సాధ్యాసాధ్యాలను బిల్లులో ప్రస్తావించలేదన్నారు. రుణాల విషయంలో రైతుల అనుమానాలను నివృత్తి చేయడంలో బిల్లు విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీపైనా స్పష్టత కొరవడిందని ఆయన ఆరోపించారు.