: చంద్రబాబు ఫాంహౌస్ కు రోడ్డు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నిరాకరణ... సొంత నిర్మాణం చేపట్టిన బాబు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఇప్పటికే సంబంధాలన్నీ తెగిపోయాయి. ఒకరిమీద మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరి మధ్య నెలకొన్న విరోధం భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం ఇరుకుగా మారింది. లోకేష్ పెళ్లితో ఇంటి జనాభా పెరగడం, త్వరలోనే కోడలు బ్రాహ్మణి తల్లి కానుండడంతో వచ్చీ పోయే బంధువులతో ఇల్లు మరింత ఇరుకుగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు, చంద్రబాబు ఇంట్లో ఓ కాన్ఫరెన్స్ హాలు కూడా ఉంది. ఈ నేపథ్యంలో, ఇంటిని విశాలంగా మార్చేందుకు మరమ్మతులు చేయాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో, తమ మకాంను తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు మార్చాలని తొలుత నిర్ణయించారు. అయితే, లేక్ వ్యూకు కాకుండా, శేరిలింగంపల్లి పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఓల్డ్ బాంబే హైవేకి సమీపంలో ఉన్న తన ఫాంహౌస్ కు మారాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఫాంహౌస్ 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఫాంహౌస్ కు బ్లాక్ టాప్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేయాలని జులై నెలలో శేరిలింగంపల్లి టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆ పార్టీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. 3 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సిన ఈ పనులకు గాను రూ. 1.98 కోట్లు ఖర్చవుతుంది. మేయర్ మాజిద్ హుసేన్ టీడీపీ కార్పొరేటర్లు సమర్పించిన దరఖాస్తును స్టాండింగ్ కమిటీకి పంపించారు. దరఖాస్తుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పనులకు అడ్డు తగిలింది. ఈ పనుల వల్ల చంద్రబాబు ఫాంహౌస్ కే కాకుండా... పొరుగునున్న మరో రెండు కాలనీలకు కూడా ఉపయోగం ఉంటుందని టీడీపీ కార్పొరేటర్లు పదేపదే విన్నవించినప్పటికీ ఫలితం మాత్రం వ్యతిరేకంగానే వచ్చింది. ఈ విషయమై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను సంప్రదించగా, ఏపీ ముఖ్యమంత్రి కోసం రోడ్డు నిర్మించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని చెప్పారని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇదే విషయంపై మేయర్ మాజిద్ హుసేన్ మాట్లాడుతూ, అత్యున్నత స్థాయిలో ఈ దరఖాస్తును నిరాకరించినట్టు ఏపీ చీఫ్ సెక్రటరీ, రెండు రాష్ట్రాల ఇంటలిజెన్స్ చీఫ్ లు తనకు చెప్పారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఐదు రోజుల క్రితం చంద్రబాబే స్వయంగా తన ఫాంహౌస్ వరకు రోడ్డు, ఇతర సదుపాయాలను ఏర్పరుచుకునే పనిలో పడ్డారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం చంద్రబాబు మీదున్న ద్వేషంతోనే పక్కనున్న కాలనీల అభివృద్ధిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సంబంధాలు అధ్వానంగా ఉన్న నేపథ్యంలో, ఈ చర్యలు భవిష్యత్తును ఇంకెన్ని మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్ కానీ, దాన్ని తిరస్కరించిన సంగతి కానీ తనకు ఏమాత్రం తెలియదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలపడం!