: ఐఏఎస్ అధికారుల కేటాయింపులపై మోదీ అసంతృప్తి
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల ఐఏఎస్ ల కేటాయింపునకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ పంపిన నివేదికను పీఎంఓ తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు జాబితాలో మార్పులు చేర్పులు చేసిన కమిటీ, మరోమారు మార్పులు చేయాల్సి వస్తోంది. ఇటీవల మూడు దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సదరు ఫైలును పరిశీలించారు. ఇన్నిసార్లు నిబంధనలు మారుస్తూ పోతే ఎలాగంటూ ఆయన ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాక పలుమార్లు నిబంధనలు మారుస్తూ రూపొందిన సదరు జాబితాను ఆమోదించేది లేదంటూ ఆయన తేల్చిచెప్పారట. దీంతో పీఎంఓ సదరు ఫైలును కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు తిప్పి పంపింది. అక్కడి నుంచి ఆ ఫైలు తిరిగి ప్రత్యూష్ సిన్హా కమిటీకి చేరింది. దీంతో మరోమారు భేటీ కావాలని తీర్మానించిన కమిటీ, ఆ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది. మరి ఐఏఎస్ ల కేటాయింపు ఈ సారైనా ఓ కొలిక్కి వచ్చేనా అన్న అనుమానాలు అధికారులను వేధిస్తున్నాయి.