: డిప్యూటీ స్పీకర్ పై కోమటిరెడ్డి అలక... బుజ్జగించిన కేసీఆర్!


ఎమ్మెల్యేలు కూడా అలకబూనుతారా? అంటే, వారూ మనుషులే కదా? అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి వారు. ఎందుకంటే, ఈయనగారు ఏకంగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపైనే అలకబూనారు. అంతేకాదు, ఉన్నట్లుండి అసెంబ్లీ నుంచి గాయబ్ అయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, ఇద్దరు ఎమ్మెల్యేలను పంపి మరీ ఆయనను సభకు పిలిపించారు. నిండు సభలో బుజ్జగించారు. అయినా, తాను అలకబూనింది డిప్యూటీ స్పీకర్ పైనే కాని, అసెంబ్లీ మీద కాదని కోమటిరెడ్డి వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ అంశంపై చర్చలో మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థనను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మన్నించలేదు. అప్పటికే ఆ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు మాట్లాడారని, కోమటిరెడ్డికి కూడా మైకివ్వలేనని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. దీంతో సభ నుంచి కోమటిరెడ్డి విసురుగా లేచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలను పంపి కోమటిరెడ్డిని సభకు పిలిపించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News