: మీడియాపై నియంత్రణతో ప్రజాస్వామ్యం మనుగడ కష్టమే: పీసీఐ నూతన ఛైర్ పర్సన్
మీడియాపై నియంత్రణ విధిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం కష్టతరంగా మారుతుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నూతన ఛైర్ పర్సన్ జస్టిస్ చంద్రమౌళి ప్రసాద్ అన్నారు. ఆయన గురువారం జస్టిస్ మార్కండేయ కట్జూ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత్రిత మీడియా కన్నా బాధ్యతారహితంగా వ్యవహరించే మీడియాను భరించడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికే తాను పాధాన్యమిస్తానని వెల్లడించారు. బాధ్యతారహితంగా వ్యవహరించే మీడియాకు ప్రజలు తమ మేధావితనంతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.