: అదానీ గ్రూప్ కు కేంద్రం సాయంపై తృణమూల్ కాంగ్రెస్ విమర్శ
ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూపుకు కేంద్ర ప్రభుత్వ సాయంపై తృణమూల్ కాంగ్రెస్ ఈరోజు రాజ్యసభలో జీరో అవర్ లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. వారికి ఇష్టమైన వ్యక్తులకు ప్రాజెక్టులు కట్టబెట్టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారీ రుణం ఇప్పించారని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని ఓ మైనింగ్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపుకు ఎస్ బీఐ రూ.6,000 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తెలిపారు. భారతదేశంలో ఏ బ్యాంకు ఇంత పెద్ద మొత్తంలో రుణం ఇవ్వలేదన్నారు. కానీ, వారు రూ.200 కోట్లకు మాత్రమే అవగాహన పత్రంపై సంతకాలు చేశారన్నారు. అయితే, ప్రపంచస్థాయి బ్యాంకులు సిటీ బ్యాంక్, డాట్షూ బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ లాండ్, హెచ్ ఎస్ బీసీ, బార్క్లేస్ బ్యాంకులు ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించాయని వివరించారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రధాని మోదీతో అమెరికా పర్యటనలో తిరిగారని, బ్రిస్బేన్ సమావేశాల్లోనూ పీఎం పక్కనే ఉన్నారన్నారు. అలా తన అనుయాయులకు కేంద్రం రుణం ఇప్పించిందని ఆరోపించారు. వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దీన్ని ఖండించారు. ఇరవై మంది వ్యాపారవేత్తల సభ్యుల బృందంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ కూడా ఒక సభ్యుడని చెప్పారు.