: అప్పట్లో మన క్రికెటర్ కూడా బంతి తగిలి మరణించాడు!
"క్రికెట్ డేంజరస్ గేమ్"! ఈ మాటన్నది ఎవరో గల్లీ స్థాయి ఆటగాడు కాదు, క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని టైమింగ్ సొంతం చేసుకున్న విండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రయాన్ లారా. ఉవ్వెత్తున ఎగసిపడే బంతులను ధైర్యంగా ఎదుర్కొనే లారా సైతం హ్యూస్ కు బౌన్సర్ తాకడంపై కదిలిపోయాడు. క్రికెట్ అంటే అదే. బాగా రిస్కున్న ఆట. ముఖ్యంగా, బ్యాట్స్ మన్ కు ముప్పు ఎక్కువ. అందుకే, రక్షణ ఉపకరణాలు వారే ఎక్కువగా ధరిస్తుంటారు. అలా ధరించినా గానీ, కొందరు గాయాలపాలవడం తెలిసిందే. మరికొందరైతే విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు విడిచారు. అలాంటి ఘటనల వివరాల్లోకెళితే... భారత్ కు చెందిన రమణ్ లాంబా కూడా బంతి తగిలి మరణించాడు. 1998లో బంగ్లాదేశ్ లో క్లబ్ క్రికెట్ ఆడుతూ లాంబా ఓ మ్యాచ్ లో షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ కు నిలుచున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న మెహ్రాబ్ హుస్సేన్ బలంగా షాట్ కొట్టాడు. బంతి లాంబాకు గట్టిగా తగిలింది. దీంతో, కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, కోమాలోకెళ్లాడు. మూడురోజులు పాటు మృత్యువుతో పోరాడిన లాంబా చివరికి కన్నుమూశాడు. క్రికెట్లో ఇలాంటి విషాద ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. 1959లో అబ్దుల్ అజీజ్ అనే పాకిస్థానీ దేశవాళీ క్రికెటర్ 19 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు విడిచాడు. బ్యాటింగ్ చేస్తుండగా, ఓ బంతి ఛాతీకి తగలడంతో మృత్యువాత పడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ సమయంలో అజీజ్ కు బౌలింగ్ చేసింది ఓ ఆఫ్ స్పిన్నర్. అతని పేరు దిల్ద్వార్ అవాన్. స్లో ఆఫ్ బ్రేక్ బంతైనా, సూటిగా వచ్చి గుండె భాగంలో తాకింది. తర్వాత బంతి ఆడేందుకు సిద్ధమవుతుండగా, అజీజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 1960లో భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ నారీమన్ కాంట్రాక్టర్ కు విండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తగిలింది. దీంతో, నారీమన్ ఆరు రోజులు కోమాలో ఉన్నాడు. ప్రాణాలు నిలిచినా, అతని కెరీర్ కు అదే చివరి మ్యాచ్ అయింది. 1975లో కివీస్ ఆటగాడు ఈవెన్ చాట్ ఫీల్డ్ కు నాలుక తెగింది. ఇంగ్లండ్ పేసర్ లీవర్ వేసిన బంతిని ఆడబోయి గాయపడ్డాడు. తదనంతరకాలంలో చాట్ ఫీల్డ్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.