: పొన్నాల భూ ఆక్రమణలపై అట్టుడుకుతున్న సభ
రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించి పొన్నాల లక్ష్మయ్య లబ్ధి చేకూరేలా ప్రవర్తించారని మంత్రి హరీష్ రావు శాసనసభలో ఆరోపించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించి పొన్నాల 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని చెప్పారు. అసైన్డ్ భూములను కొన్నట్టు గతంలో పొన్నాల కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ భూములను తనకు కేటాయించాలని పొన్నాల హైకోర్టుకు వెళ్లారని... ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చిందని హరీష్ చెప్పారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పొన్నాల ఇలాంటి పనులు చాలా చేశారని అన్నారు. హరీష్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, సభలో గందరగోళం చెలరేగింది.