: పార్లమెంట్ క్యాంటిన్ లో హైదరాబాదీ బిర్యానీ రెడీ!
మాంసాహారుల నోళ్లలో నీళ్లూరించే హైదరాబాదీ బిర్యానీ పార్లమెంట్ క్యాంటిన్ లో అడుగుపెట్టింది. నిన్నటి నుంచి పార్లమెంట్ సభ్యులతో పాటు అక్కడికొచ్చే సందర్శకులకు కూడా హైదరాబాదీ బిర్యానీ అందుబాటులోకి వచ్చేసింది. పార్లమెంట్ ఫుడ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన లోక్ సభలో టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి, క్యాంటిన్ లో పనిచేస్తున్న నలుగురు వంట మనుషులను హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాదీ బిర్యానీ తయారీలో కాకలు తీరిన నలభీముల వద్ద శిక్షణ ఇప్పించారట. దిగ్విజయంగా శిక్షణ ముగించుకుని తిరిగి ఢిల్లీ చేరిన సదరు వంట మనుషులు మంగళవారం నుంచే బిర్యానీ తయారీని ప్రారంభించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులను మైమరపించిన హైదరాబాదీ బిర్యానీ, పార్లమెంట్ క్యాంటిన్ ద్వారా ఎంతమంది భోజన ప్రియులను తన అభిమానులుగా మలచుకుంటుందో చూడాలి.