: చాక్లెట్ల లారీని యజమాని సహా సినీ ఫక్కీలో కిడ్నాప్
చాక్లెట్ల లారీని యజమాని సహా సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి చెన్నైకు చాక్లెట్ల లోడుతో మినీ లారీ బయల్దేరింది. తడ మండలంలోని పెరియవట్టు వద్దకు లారీ వచ్చే సరికి స్కార్పియో వాహనంలో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాణిజ్యపన్ను అధికారులమంటూ లారీని ఆపారు. 'రికార్డులు తీసుకురండి' అంటూ చెప్పడంతో డ్రైవర్ దర్బార్ సింగ్, క్లీనర్ శంకర్ కిందికి దిగారు. వీరిద్దరినీ బలవంతంగా స్కార్పియోలొకి ఎక్కించుకుని కాళ్లు, చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టారు. దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ వారిని విడిచిపెట్టి వెనుదిరిగారు. అటు, లారీలో ఉన్న యజమాని దినేష్ చౌహాన్ సహా లారీని మరో ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. కాగా, లారీ ఆచూకీ తెలియలేదు. అటవీ ప్రాంతంలో వదిలివేయబడ్డ డ్రైవర్, క్లీనర్ తమిళనాడు పరిధిలోని ఆరంబాక్కం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పి వారిని పంపేశారు. దీంతో, వారు నెల్లూరు జిల్లాలోని తడ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన డీఎస్పీ... సీఐల సహా బాధితులతో సంఘటనా స్థలి పరిశీలించేందుకు వెళ్లారు.