: బ్యాట్ తీసుకెళుతుంటే టెర్రరిస్టు ముద్రవేశారు!


బెల్జియంలో ఓ పాకిస్థానీ యువకుడు బ్యాట్ తీసుకెళుతుంటే అతడిపైనా, అతడి కుటుంబంపైనా టెర్రర్ ముద్రవేశారు. వివరాల్లోకివెళితే... ఈ ఏడాది ఆరంభంలో బ్రస్సెల్స్ లోని జ్యూయిష్ మ్యూజియంపై దాడి జరిగింది. ఇది ఉగ్రవాదుల పనే అని అనుమానించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు గతవారం ఓ ఫొటో విడుదల చేశారు. ఆ ఫొటోలో ఓ యువకుడు చొక్కా కింద ఏదో దాచి తీసుకువెళుతున్నట్టుగా ఉంది. ఆ ఫొటోలో ఉన్న యువకుడి పేరు అసీమ్ అబ్బాసి (22). అతడి తండ్రి బెల్జియంలో పాక్ దౌత్యాధికారి. కాగా, ఆ ఫొటోలు చూసిన అబ్బాసి వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి, తాను చొక్కా కింద పెట్టుకుని తీసుకువెళుతున్నది ఆయుధం కాదని, క్రికెట్ బ్యాట్ అని వివరణ ఇచ్చాడు. ప్రాక్టీసుకు వెళుతుండగా, వర్షం రావడంతో బ్యాట్ ను చొక్కా కింద దాచానని తెలిపాడు. అయితే, ఇదేమీ పట్టించుకోని పోలీసులు తదుపరి చర్యలకు ఊపక్రమించారు. అటు, పాక్ ఎంబసీ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ అబ్బాసి తండ్రిని విధుల నుంచి తొలగించింది. తమకు పాక్ ఎంబసీ నుంచి పిలుపు వచ్చిందని, పాస్ పోర్టులు ఇచ్చేయాలని చెప్పారని అబ్బాసి తెలిపాడు. బెల్జియంలో నివసించే అవకాశం కోల్పోయామని, తాను చదువుతోపాటు, అన్నీ నష్టపోయానని అబ్బాసి వాపోయాడు.

  • Loading...

More Telugu News