: లూజ్ సిగరెట్ల అమ్మకంపై త్వరలో నిషేధం!
దేశంలో సిగరెట్ల వాడకాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోబోతోంది. లూజ్ సిగరెట్ల విక్రయాలను నిషేధించాలంటూ నిపుణుల కమిటీ సూచించిన సిఫారసులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో మంత్రి జేపీ నద్దా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. "లూజ్ సిగరెట్లు లేదా సింగిల్ సిగరెట్ అమ్మకంపై నిషేధం విధించాలని నిపుణుల కమిటీ సూచించింది. అంతేగాక, పొగాకు ఉత్పత్తులను కొనేందుకు చట్టపరంగా కనీస వయసును పెంచింది. దాంతోపాటు పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద సిగరెట్ల విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని కూడా పెంచింది. ఆరోగ్య శాఖ వాటన్నింటికీ ఆమోదం తెలిపింది. దీనిపై డ్రాఫ్ట్ నోట్ ను సలహాల కోసం కేబినెట్ కు పంపించాం" అని తెలిపారు. ఈ కమిటీ సిఫారసులను అమలు చేయాలంటే ముందు పార్లమెంటులో ఆ డ్రాఫ్ట్ ను బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. కొత్తగా రాబోతున్న నిబంధనలు పొగాకు పరిశ్రమపై భారీగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.