: 'లైక్స్' మోజులో 'షాక్' తిన్నాడు... ప్రాణాలు కోల్పోయాడు!


స్మార్ట్ ఫోన్ ల రాకతో యువతలో సెల్ఫీల మోజు ఎక్కువైంది. క్లాస్ రూంలో సెల్ఫీ, ఆఫీసులో సెల్ఫీ, విహారయాత్రలో సెల్ఫీ, చివరికి ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా సెల్ఫీయే! అంతలా పాకిపోయింది! ఫేస్ బుక్ లో సెల్ఫీ పోస్టు చేసిన క్షణం నుంచీ లైక్స్ కోసం కాచుకు కూర్చుంటున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈ తొమ్మిదో తరగతి విద్యార్థి కూడా అలాంటివాడే. అయితే, ప్రాణాలు కోల్పోయాడు! వివరాల్లోకి వెళితే... సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న ఆ విద్యార్థి పేరు కేతన్. బిలాస్ పూర్ జిల్లా వైశాలి నగర్ వాసి. కేతన్ తండ్రి సంజయ్ పోద్దార్ రైల్వేలో ఇంజన్ డ్రైవర్. ఆదివారం సాయంత్రం మిత్రులతో కలిసి కేతన్ ఉస్లాపూర్ లోకోమోటివ్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అక్కడ గతంలో ఓ గూడ్సు రైలు పై నిలబడి తీసుకున్న ప్రొఫైల్ పిక్చర్ కు ఫేస్ బుక్ లో ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అందుకే మరోసారి అక్కడే, అదే రైలుపై నిలబడి ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో గూడ్సు రైలు ఎక్కాడు. కొన్ని స్నాప్స్ క్లిక్ చేసిన తర్వాత, చేతులు పైకెత్తి పోజ్ ఇవ్వబోయాడు. పైన ఉన్న విద్యుత్ వైర్లు అతని చేతులకు తగలడంతో విద్యుదాఘాతానికి లోనయ్యాడు. దీంతో, అతని మిత్రులు భయపడ్డారు. విషయం ఎవరికీ చెప్పకుండా, ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కేతన్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెదుకులాట ప్రారంభించారు. అతని స్నేహితులను గట్టిగా అడిగితే, అప్పుడు చెప్పారు... కేతన్ చనిపోయాడని. పోలీసులు ఆ విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News