: సహారా ఇండియా ఆఫీసులపై ఐటీ దాడులు...రూ.135 కోట్ల నగదు స్వాధీనం
సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, నోయిడాల్లోని సంస్థ కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.135 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఇప్పటిదాకా తాము జరిపిన దాడుల్లో ఇంత పెద్ద మొత్తం నగదు లభించడం ఇదే ప్రథమమని దాడుల తర్వాత ఆ శాఖాధికారులు వెల్లడించారు. ఈ నెల 22న జరిగిన ఈ సోదాల విషయం కాస్త ఆలస్యంగా సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నగదుతో పాటు దాదాపు రూ.1 కోటి విలువ చేసే నగలను కూడా ఆదాయపన్ను శాఖ సహారా కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే ఆదాయపన్ను శాఖ దాడులు, పట్టుబడ్డ నగదు, నగల విషయంలో సహారా సిబ్బంది వితండ వాదం చేస్తోంది. దాడులను అంగీకరించడానికి ఇష్టపడని సిబ్బంది, ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకున్న నగదు మాత్రం నల్లధనం కాదని వెల్లడించడం గమనార్హం. సహారా కార్యాలయాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసింది.