: అనంతపురం జిల్లాలో రైతుల దగ్గరకు టీడీపీ నేతలు ఎందుకు యాత్రలు చేయడం లేదు?: హరీష్ రావు
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని బస్సుయాత్రలు చేస్తున్న టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో రైతులకు న్యాయం చేయాలని ఎందుకు పోరాటం చేయడం లేదని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం రైతులను రుణవిముక్తులను చేసింది. మరి ఏపీలో ఏం జరిగిందని ప్రశ్నించారు. ఏపీలో రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందని, అక్కడ బస్సుయాత్ర చేపట్టండని ఆయన టీటీడీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పటివరకు రుణమాఫీ గురించి మాట్లాడడం లేదని హరీష్ రావు గుర్తు చేశారు. చేతనైతే తెలంగాణ రైతుల్లో టీడీపీ నేతలు ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయాలని సూచించారు. రెండేళ్లలో రైతులకు పూర్తి స్థాయి విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతవరకు రైతులు ఓపిక పట్టాలని ఆయన సూచించారు.