: పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకో!: జగన్ కు సోమిరెడ్డి సలహా!
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి జగన్ తప్పుకోవడం మేలని సూచించారు. నైతిక విలువలు ఏమైనా జగన్ లో మిగిలి ఉంటే, అధ్యక్ష పదవిని నచ్చిన ఎమ్మెల్యేకి అప్పగించాలని హితవు పలికారు. అధ్యక్షుడి హోదాలో ఉండే అర్హత జగన్ కు లేదన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ, నెలకు 11 సార్లు కోర్టుకు వెళ్లే వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా పనిచేస్తారా? ప్రజలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటే ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, కానీ, జగన్ కేసులో ఎన్నో వేల కోట్ల రూపాయలు అక్రమార్జనకు గురైనట్టు సీబీఐ పేర్కొందని, 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడని, అయినాగానీ జగన్ మాత్రం పార్టీ అధ్యక్ష పదవిని వీడడం లేదని అన్నారు. గతంలో బస్సులు, రైళ్ల యాక్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, కానీ, బరితెగించిన జగన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని విమర్శించారు. ఆయనపై అక్రమార్జన కేసు, అవినీతి కేసు ఇలా పలు కేసులు ఉన్నాయని, సీబీఐ ఇటీవలే 11వ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఏ పార్టీ కూడా జగన్ పార్టీని విలీనం చేసుకోదని, కనీసం దగ్గరకు కూడా రానీయదని చెప్పారు.