: ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం


తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఛానల్ ప్రసారాల నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్ వోలను ఆదేశించింది. గతవారం కూడా ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా ఎంఎస్ వోలు, ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో, ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదో పేర్కొంటూ, ప్రసారాలు నిలిపివేయడానికి గల కారణాలను పొందుపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణలో ఆరు నెలలుగా ఏబీఎన్ ప్రసారాలు ఆపివేశారంటూ మురళీ అనే వ్యక్తి ఆ పిల్ ను దాఖలు చేశారు. ఇదిలాఉంటే ఇదే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రెండింటితో పాటు 15 మంది ఎంఎస్ వోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ సీపీ, ఎంఎస్ వో అసోసియేషన్ కు కూడా నోటీసులు ఇచ్చింది. వాటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేసి ఎంఎస్ వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనంటూ ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీం పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News