: పాక్ తో పోలిస్తే భారత్ లోనే ముస్లింలు సుభిక్షంగా ఉన్నారు: బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ప్రచార పర్వం జోరందుకుంది. అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, పాకిస్థాన్ లో కంటే భారత్ లోనే ముస్లింలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ లో ప్రతి పౌరుడు, ప్రాంతాలకు అతీతంగా, రాజ్యాంగం అందించే హక్కులు కలిగి ఉంటాడని వివరించారు. బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన సరిహద్దు ప్రాంతాలైన సురాన్ కోట్, పూంచ్, మెంధర్ లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలిగే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని షానవాజ్ హుస్సేన్ ఉద్ఘాటించారు. స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఉపాధి, విద్య, భద్రత, రోడ్ల అనుసంధానం, సురక్షితమైన తాగునీరు, అవినీతితో పాటు వారసత్వ పాలనను అంతమొందించడంపై బీజేపీ దృష్టి పెడుతుందని హుస్సేన్ వివరించారు. బీజేపీకి ఓటేస్తే జమ్మూ కాశ్మీర్ ను మునుపెన్నడూ లేని విధంగా పురోగామి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.