: తమిళ నటుడు సూర్య అవయవదానం
అవయవదానం పట్ల దేశంలో క్రమంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయమై విశేష ప్రచారం కల్పిస్తున్నారు. అంతేగాకుండా, తాము సైతం అవయవదానం ప్రతిజ్ఞ చేస్తూ, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు సూర్య అవయవదానం చేశారు. చెన్నైలో ఓ మారథాన్ పరుగును ప్రారంభిస్తూ, ఆయన అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ పరుగులో పాల్గొన్న ఔత్సాహికులను ఉద్దేశించి మాట్లాడుతూ, "నేను అవయవదానం చేశాను, మరి మీరు?" అంటూ ఉత్సాహపరిచారు. కాలేయాన్ని కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని సూచించారు. కాగా, ఇంతకుముందే నాగార్జున (అన్ని అవయవాలు), రజనీకాంత్ (కళ్లు), స్నేహ (కళ్లు), మాధవన్ (కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, పేంక్రియాస్, ఎముకలు, కార్టిలేజ్) తదితరులు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. కాగా, కమలహాసన్ తన శరీరాన్ని వైద్య శాస్త్ర ప్రయోగాల నిమిత్తం అందిస్తానని, అవయవాలను మార్పిడి కోసం దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.