: బస్సులో ఏపీ హోం మంత్రి ప్రయాణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం రాత్రి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి జయంత్యుత్సవాలకు విజయవాడ నుంచి తన సొంత కాన్వాయ్ లో బయలుదేరిన చినరాజప్ప, కొద్ది దూరం వెళ్లగానే కాన్వాయ్ ఆపేసి కారు దిగేశారు. అనంతరం అనంతపురం వెళుతున్న ప్రైవేట్ బస్సును ఎక్కేశారు. దీంతో ఏం జరిగిందోనని బస్సులోని ప్రయాణికులు కంగారు పడితే, ఆయన బస్సెందుకెక్కారోనని భద్రతా సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఇవేవీ పట్టించుకోని చినరాజప్ప, చక్కగా బస్సు సీట్లో కూర్చుని, అనంతపురం జిల్లా శింగనమల దాకా ప్రయాణించారు. శింగనమల చేరుకోగానే బస్సు దిగిన హోం మంత్రి తిరిగి తన కాన్వాయ్ ఎక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకున్న చినరాజప్ప, సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు. అయితే విజయవాడ దాటిన తర్వాత చినరాజప్ప కారు దిగి బస్సెందుకెక్కారో ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ బోధపడలేదు.