: టెక్సాస్ రాష్ట్రంలో భారీ పేలుడు.. ఎంతో మంది బలి?
బోస్టన్ పేలుళ్లు మిగిల్చిన విషాదాన్ని మరచిపోకముందే అమెరికాలో మరో భారీ ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని వాకో సమీపంలో ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. 100 మంది వరకూ గాయపడగా, మృతుల సంఖ్యపై పలు సందేహాలు నెలకొన్నాయి. 70 మంది వరకూ మరణించి ఉండివచ్చంటున్నారు. గాయపడ్డ వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఆస్పత్రి భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. ఇందులో ఎంతో మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పేలుడు అనంతరం మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. హెలికాప్టర్ల సాయంతో వాటిని ఆర్పివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సమాంతరంగా సహాయక కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. మంటలు పూర్తిగా ఆగిపోతేనేగానీ మృతుల సంఖ్య, గాయపడ్డవారి సంఖ్య కచ్చితంగా తెలిసేలా లేదు.