: అసలింతకీ ములాయం వయసెంత?


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు గందరగోళం నడుమ నిర్వహించాయి. ములాయం వయసెంతో కచ్చితంగా తెలియకుండానే నేతలు, కార్యకర్తలు వేడుకలు జరిపారు. కొందరు ములాయంకు 77వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారట. మరికొందరు ఆయన 76 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటూ ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మిగిలిన వారు నవంబర్ 22వ తేదీని ములాయం 75వ జన్మదినంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గోలు యాదవ్ అనే మాజీ ఆఫీస్ బేరర్ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. దాంట్లో ములాయంకు 77వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అధినేత వెయ్యేళ్లు బతకాలని అందులో ఆకాంక్షించారు. ములాయం వయసుపై అడగ్గా, ఆయన వయసు కచ్చితంగా తెలియదని, అయితే, వయసు తెలియకున్నా, ఈ స్థాయిలో సంబరం చేసుకోవడం సరైనదే అని చెప్పుకొచ్చారు గోలు. ఇక, అఖిల్ యాదవ్- బ్రాహ్మిణ్ మహాసభ వారైతే 76వ జన్మదినంగా భావించి పెద్ద ఎత్తున యాగం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం తమవంతుగా 75వ పుట్టినరోజు వేడుకలు జరిపారు. స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు... ములాయం వయసెంతో తెలియకుండానే. ములాయం 1939 నవంబర్ 22న జన్మించారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా ప్రాంతంలోని సైఫాయి ఆయన జన్మస్థలం.

  • Loading...

More Telugu News