: ఒక టెర్మినల్ కు రెండు పేర్లెలా పెడతారు?: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీ ముఖ్యుడు దిగ్విజయ్ సింగ్ తో టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. తెలంగాణలో పార్టీ భవిష్యత్, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు. తాము తెలంగాణ ఇచ్చినా అధికారం చేజక్కించుకోలేకపోవడంపైనా సమాలోచనలు చేశారు. అటు, శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపెట్టడంపై ఇందులో చర్చించారు. దీనిపై దిగ్విజయ్ మాట్లాడుతూ, పేరు మార్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. ఒకే భవనానికి రెండు పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇక, కేసీఆర్ పైనా ఆయన ధ్వజమెత్తారు. ఆయన స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులపై కూడా హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఫిరాయింపులపై వచ్చే పిటిషన్లను స్పీకర్, చైర్మన్ నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా కేంద్రం చట్టం చేయాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి ఎంఐఎం మద్దతు పలుకుతోందని విమర్శించారు. బీజేపీని గెలిపించేందుకే అవిశ్వాసానికి ఎంఐఎం హాజరుకాలేదని ఆరోపించారు. ఢిల్లీలోనూ బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం పోటీ చేయాలనుకుంటోందని డిగ్గీ రాజా అన్నారు.