: 'దూస్రా' కొనసాగిస్తానంటున్న పాక్ స్పిన్నర్
అక్రమ బౌలింగ్ యాక్షన్ తో ఐసీసీ సస్పెన్షన్ వేటుకు గురైన పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన ప్రధానాస్త్రం 'దూస్రా'ను కొనసాగిస్తానంటున్నాడు. 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న అజ్మల్ ఓ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన బౌలింగ్ యాక్షన్ కు క్లీన్ చిట్ వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు. సక్లయిన్ ముస్తాక్ పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకుంటున్నట్టు తెలిపాడు. ఒకవేళ వరల్డ్ కప్ లో తాను ఆడలేకపోయినా, జట్టుకు తన మద్దతు ఉంటుందని అన్నాడు. ఇక, తన బౌలింగ్ తీరుతెన్నుల గురించి చెబుతూ, కేవలం దూస్రా ప్రయోగించేటప్పుడే మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతోందన్న అజ్మల్, మిగతా డెలివరీలు బౌల్ చేసేటప్పుడు నిబంధనలకు లోబడి మోచేయి వంగుతున్నట్టు గుర్తించామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దూస్రాను లోపభూయిష్టంగా, నిబంధనలకు అనుగుణంగా బౌల్ చేయడంపై కృషి చేస్తున్నానని పేర్కొన్నాడు.