: చంద్రబాబు దూకుడు... మోదీకి సిద్ధరామయ్య, జయ ఫిర్యాదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి. తెలంగాణ ఉద్యమంతో ఐటీ పరిశ్రమల్లో అత్యధిక శాతం ఈ రెండు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. ఉద్యమం పుణ్యాన కర్ణాటక, తమిళనాడు బాగానే లాభపడ్డాయి. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోవడంతో సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం పురోగతి మందగించింది. విభజన అనంతర ఎన్నికల్లో గెలిచి మళ్లీ పగ్గాలు చేపట్టిన బాబు, భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం, బాబు ఏపీలో పెద్ద ఎత్తున పన్ను రాయితీలను ప్రకటించడం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అవకాశాలను ప్రభావితం చేయనుంది. దీనిపైనే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ప్రధాని మోదీకి లేఖలు రాశారు. చంద్రబాబు అమలు చేస్తున్న పన్ను విధానం అనైతికమని వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. బాబు ఏకంగా బెంగళూరు వెళ్లి పారిశ్రామికవేత్తలు, వ్యాపారదిగ్గజాలతో చర్చలు జరపడం కూడా సిద్ధరామయ్యకు మింగుడుపడని విషయమే. బాబు దూకుడు ఇలాగే కొనసాగితే, ఐటీ పరిశ్రమలు ఏపీకి బారులు తీరడం ఖాయమని కర్ణాటక సీఎం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.