: విరేచనాల కారణంగా అండర్ వేర్ లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేశా: సచిన్
సచిన్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో పలు ఆసక్తికర విషయాలను పొందుపరిచాడు. అందులో 2003 ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ సిక్స్ దశలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా తాను పడిన బాధను కూడా వెల్లడించాడు. విరేచనాల కారణంగా ఈ మ్యాచ్ లో అండవేర్ లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. "మ్యాచ్ కు ముందే కడుపులో తిప్పడం మొదలైంది. డీహైడ్రేషన్ జరుగుతుందనిపించింది. పాక్ తో మ్యాచ్ సమయంలోనే ఇది మొదలైంది. దాన్నుంచి పూర్తిగా కోలుకోక ముందే లంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అప్పటికీ ఐసోటోనిక్ డ్రింక్స్ తీసుకున్నా. త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఎనర్జీ డ్రింక్ లో ఓ టీస్పూన్ ఉప్పును కూడా కలుపుకుని తాగా. కానీ సీన్ రివర్స్ అయింది. కడుపులో కలవరం ప్రారంభమయింది. కానీ, ఏం చేయలేని పరిస్థితిలో, అండర్ వేర్ లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. డ్రింక్స్ విరామ సమయాల్లో డ్రెస్సింగ్ రూమ్ కు పరిగెత్తడం, టిష్యూ పేపర్లు సరిచేసుకుని రావడం. ఇలా కొనసాగింది నా ఆట" అంటూ ఆనాటి తన కష్టాలను సచిన్ వెల్లడించాడు. మరో విషయం ఏమిటంటే, ఆ మ్యాచ్ లో సచిన్ 120 బంతుల్లో 97 పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు. ఏదేమైనా మాస్టర్ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది కదా.