: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నది బాబు కాదా?: హరీష్ రావు
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిగా పురందేశ్వరి ప్రతిపాదిస్తే అడ్డుకున్నది ఏపీ సీఎం చంద్రబాబు కాదా? అని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీటీడీపీ నేతలకు దీక్షలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు. ఆ పార్టీ నేతలు చేస్తున్నదంతా కొంగ జపం, దొంగ జపమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పై నిజమైన గౌరవం ఉంటే తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలు పటేల్, దొర అంటూ తమను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తున్నారని, పటేల్, పట్వారీలున్నప్పుడు కూడా తెలంగాణలో కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, కాంగ్రెస్ తో కుమ్మక్కైందని ఆయన విమర్శించారు.