: మంచు తుపానుతో గజగజలాడుతున్న న్యూయార్క్
అమెరికాలో గత వారం రోజులుగా కురుస్తున్న మంచు ధాటికి న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. న్యూయార్క్ లో మంచుతుపాను కొనసాగుతుండగా, బఫెల్లో నగరంలో గత రెండు రోజుల్లో సుమారు 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచుతుపాను ప్రభావం కొనసాగుతుండడంతో మరో మూడు అడుగుల మంచు పేరుకునే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు భారీ స్థాయిలో కురుస్తుండడంతో పేరుకున్న మంచు ధాటికి కొన్ని ఇళ్ల పై కప్పులు బీటలు వారుతున్నాయి. దీంతో ఇళ్లు కూలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బఫెల్లో నగరానికి వెళ్లే రహదారులన్నీ మంచుతో కప్పుకుపోవడంతో దారులు మూసుకుపోయాయి. మంచు తీవ్రతకు న్యూయార్క్ స్టేట్ లో 10 మంది మృతిచెందారు. ఈ స్థాయిలో మంచు కురవడం తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఐదు వేల మంది నేషనల్ గార్డ్స్, అధికారులు మంచు తొలగించే చర్యల్లో పాల్గొంటున్నారు.